బలవంతమైన సర్పం చలి చీమల చేత చిక్కి చావదే సుమతీ పద్యం చిన్నప్పుడు అంతా చదువి నెమరు వేసుకుని ఉన్నాం. మరి నిజంగా చీమలకు అంత బలం ఉందంటారా? ఎంత ఒక్కటిగా కలిసి వచ్చినా అది సాధ్యమేనా అని ఒక్కొసారి అనిపిస్తుంటుంది. కానీ, ఇక్కడ ఓ చీమల గుంపు అంతా కలిసి ఓ రైలుకి, అందులోని ప్రయాణికులకు చెమటలు పట్టించాయి. అంతే దెబ్బకు రైలుకు బ్రేకులు పడ్డాయి. అసలేం జరిగిందనే కదా మీ అనుమానం.
గురువారం మధ్యాహ్నం ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి సుమారు 1.30 గంటలకు ఓ లోకల్ ట్రెయిన్ బయలుదేరింది. మాతుంగా ప్రాంతం దాటిన తర్వాత ప్రధానమైన ఈపీ బ్రేక్ ఫెయిల్ అయ్యిందట. అయితే డ్రైవర్ అప్రమత్తం కావటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎలక్ట్రో న్యూమాటిక్ (ఈపీ) కనెక్టయి ఉండే కేబుళ్లలో ఒకటి సరిగా పనిచేయకపోవటమే దీనికి కారణమని తర్వాత గుర్తించారు. ఓ చీమల గుంపు ఆ కేబుల్ ను కొరికేయటంతోనే ఇది జరిగిందని తెలుస్తోంది. అయితే ప్రత్యామ్నాయమైన రెండో బ్రేక్ ను ఉపయోగించి ఎటువంటి ప్రమాదం జరగకుండా ట్రెయిన్ డ్రైవర్ గట్టెక్కించాడు.
ఘటనపై సెంట్రల్ రైల్వే (సీఆర్) చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ,,, ఈపీ బ్రేక్ ఫెయిలైనంత మాత్రాన భయపడాల్సిన పనిలేదని, ప్రత్యామ్నాయంగా మూడు బ్రేకులు ఉన్నాయని చెప్పారు. చీమల బాధ లేకుండా ఉండేందుకు పెస్ట్ కంట్రోల్ ను అనుసరిస్తున్నప్పటికీ ఇబ్బంది తప్పట్లేదని ఆయన అంటున్నారు.