హెచ్ఐవీ సోకిన వ్యక్తుల పట్ల వివక్షత ప్రదర్శించవద్దని, వారిని సామాన్య పౌరులుగానే చూడాలని నేతల దగ్గరి నుంచి సెలబ్రిటీల దాకా మొత్తుకుంటున్నప్పటికీ అమానుష ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. హెచ్ఐవీ పాజిటివ్ ఉందనే కారణంగా అభం శుభం తెలీని ఓ చిన్నారిని స్కూలు నుంచి గెంటేశారు. సమాజం తలదించుకునే రీతిలో జరిగిన ఈ ఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది. కోల్ కతా అతి సమీపంలో పైగా ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ అవమానీయమైన ఘటన జరగటం శోచనీయం.
ఒకటో తరగతి చదువుతున్న ఆ చిన్నారిని తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సూటిపోటీ మాటలతో బాధపెడుతున్నా పాఠశాల సిబ్బంది ఏ మాత్రం అడ్డుకోలేదు. పైగా, మళ్లీ స్కూలుకు రావద్దంటూ ఆ చిన్నారిని తరిమేశారు. వాస్తవానికి తనకు, తన కుమారుడికి వ్యాధి ఉన్న సంగతి స్కూలు యాజమాన్యానికి ఆ చిన్నారి తల్లి ముందే తెలిపింది. అంతేకాదు, ఎయిడ్స్ పై అవగాహన కల్పించే సంస్థలో తాను పనిచేస్తున్నట్టు కూడా చెప్పింది. అప్పుడు అభ్యంతర పెట్టని స్కూలు యాజమాన్యం, ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించింది. అయితే, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేయడం వల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చామని యాజమాన్యం చెబుతోంది. జరిగిన ఘటనపై విద్యార్థి తల్లి తీవ్ర అభ్యతరం తెలిపింది. దీంతో స్థానిక నేతలు ఎవరైనా కలుగజేసుకుని చిన్నారికి న్యాయం చేయాలని కోరుతోంది.