ఆ సెక్షన్ ను సమీక్షించాల్సిందే

March 31, 2015 | 05:05 PM | 59 Views
ప్రింట్ కామెంట్
supreme_court_india_niharonline

రోడ్డు  ప్రమాదాల కేసుల్లో అతి తక్కువ శిక్షలు  విధిస్తున్నారని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీని మూలంగా   న్యాయవ్యవస్థ అపహాస్యం పాలవుతోందని పేర్కొంది. 2007 లో ఇద్దరు వ్యక్తుల మరణానికి దారితీసిన   ఒక ప్రమాదం కేసు విచారణ సందర్భంగా   సోమవారం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తక్షణమే 304ఎ  చట్టాన్ని పునరాలోచించి సమీక్షించాలని  చట్టసభ్యులకు సూచించింది.  వాహన చోదకుల నిర్లక్ష్యంమూలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరగడాన్ని గమనించామని... చాలా బాధగా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తోందంది.  దేశంలో పేదలు తమ ప్రాణాలకు రక్షణ లేదని భావిస్తున్నారని, పాదచారులు అయోమయ స్థితిలో ఉండిపోతున్నారని వ్యాఖ్యానించింది.   వారు క్షణ క్షణం భయపడుతూ భయం భయంగా వాహనాన్ని నడపాల్సి వస్తోందని అభిప్రాయపడింది.  నాగరీకులుగా చెప్పుకునే కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం, అత్యుత్సాహ చర్యల కారణంగా  ఇతరులు  బలైపోతున్నారంది.   పేదలు ప్రాణాలు కూడా విలువైనవిగా పరిగణించాలని జస్టిస్ దీపక్ మిశ్రా, ప్రఫుల్ సి. పంత్‑తో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. ప్రస్తుతమున్న ఈ శిక్షలు బాధితులు,  వారికి సంబంధించిన ఎంతోమంది ప్రజల  జీవితాన్ని ప్రభావితం  చేస్తున్నాయని తెలిపింది.  ఇప్పటికైనా వీటిని పునస్సమీక్షించాలని వ్యాఖ్యానించింది. ఐపీసీ  సెక్షన్ 304ఎ ప్రకారం నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి మరణానికి దారితీసిన కేసుల్లో   రెండు సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశాన్ని ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ