మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చనిపోయినప్పుడు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసినప్పటికీ... ఆయన కీర్తిని తిరిగి పునరుద్ధరించాలని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటోంది. ఈ మేరకు ఢిల్లీలో ఆయనకో స్మ్రుతి చిహ్నం ఏర్పాటు చేసి దేశ ఆర్థిక సంస్కరణల వాస్తుశిల్పి అయిన పీవీని సముచితంగా గౌరవించాలనుకుంటోంది. ఈ క్రమంలో ఏక్తాస్థల్ సమాధి కాంప్లెక్స్ లో పీవీకి స్మారకంగా ఘాట్ నిర్మించేందుకు అనుమతికోసం గతవారం కేంద్ర పట్టణాభివ్రుద్ధి మంత్రిత్వ శాఖ కేబినెట్ కు ఓ ప్రతిపాదన పంపిందని సమాచారం. పీవీ స్మారక ఘాట్ పాలరాతితో ఉంటుందంటున్నారు. తెలంగాణకు చెందిన పీవీకి స్మారక చిహ్నంగా ఘాట్ నిర్మించాలని కోరుతూ గతేడాది అక్టోబర్ లో తెలుగుదేశం ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దాంతో టీడీపీ డిమాండ్, ఒత్తిడితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవటంతో అటు కాంగ్రెస్ కు తీవ్ర అవమానభారం మిగలనుంది. ఇటు బీజేపీకి మంచి పేరు దక్కనుంది. మితభాషి, బహుభాషా కోవిదుడు, మన తెలుగు బిడ్డకు ఇది చంద్రునికో నూలుపోగు. కాంగ్రెస్ ప్రభువుల కంటి శుక్లాలకు జరుగుతున్న ఉచిత నేత్ర వైద్యం. పైనుంచి పీవీ చిద్విలాసంగా నవ్వుకునే సందర్భమిది!