2007 వరల్డ్ కప్ క్రికెట్ గాడ్ సచిన్ కి అత్యంత చేదు అనుభవాన్ని మిగిల్చిందంట. వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ తొలి రౌండ్‌లోనే వెనుదిరగడం తన కెరీర్‌లో అత్యంత బాధాకరమైన క్షణంగా సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. అదో చెత్త ప్రదర్శన అని అతను పేర్కొన్నాడు. ఈ యేడాదిలో నిర్వహించబోయే వన్డే ప్రపంచ కప్‌కు అంబాసిడర్ గా ఎంపికైన సచిన్, గత టోర్నీలకు సంబంధించి తన అనుభవాలు మీడియాతో పంచుకున్నాడు. మొత్తం ప్రపంచ కప్‌లో నేను మరచిపోదగ్గ ప్రదర్శన 2007లో వెస్టిండీస్‌లో వచ్చింది. టోర్నీ ఆరంభంలోనే నిష్ర్కమించడం నా కెరీర్‌లోనే ఇబ్బందికర క్షణం. మా జట్టు నిజానికి చాలా బలమైన జట్టు.అయినా ఎందుకో విఫలమయ్యాం. విజేతగా నిలిచిన జట్టులో భాగం కావాలన్న నా కోరిక అలాగే ఉండిపోయింది. అయితే ఆ నిరాశ నుంచి బయటపడి నాలుగేళ్ల తర్వాత టైటిల్‌తో విమర్శకులకు సమాధానమిచ్చాం అని సచిన్ అన్నాడు. ఈ సంత్సరం జరగబోయే టోర్నీ టైటిల్ నిలబెట్టుకోగల సత్తా ప్రస్తుత జట్టుకు ఉందని మాస్టర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.