కామన్ గా మనం రోజు వార్తల్లో చూసేది ప్రేమించిన యువకుల చేతుల్లో అమ్మాయిలు మోసపోవటం. నమ్మించి నట్టేట ముంచుతున్న యువకులను కఠినంగా శిక్షించాలని, వారితోనే తమకు పెళ్లి చేయాలని ఉద్యమించటం యువతుల వంతు. అయితే కర్ణాటకలో మాత్రం కాస్త వింత జరిగింది. తుమకూరు జిల్లా బెళ్లావి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇందుకు విరుద్ధమైన వాదన చేస్తున్నాడు. ప్రేమించిన పాపానికి ప్రేమికురాలి చేతిలోనే తాను శీలం కోల్పోయానని, తనకు న్యాయం చేయాలని ఆ యువకుడు ఏకంగా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు.
బెళగావి ప్రాంతానికి చెందిన శివకుమార్ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అతడికిష్టం లేకపోయినా సదరు యువతి అతడితో శారీరక సంబంధం నెరపి గర్భం కూడా దాల్చింది. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు శివకుమార్ ను బెదిరించి రూ.30 వేలు లాక్కుని ఆమెకు గర్భస్రావం చేయించారు. ఆ తర్వాత కూడా యువతి శివకుమార్ తోనే కొంతకాలం పాటు సహజీవనం చేసింది. ఈ క్రమంలో ఆమె కోసం శివకుమార్ ఏకంగా రూ.5 లక్షల మేర ఖర్చు పెట్టాడు. తాజాగా ఆ యువతి శివకుమార్ తో దూరంగా ఉంటోందట. అంతేకాక ప్రస్తుతం ఆ యువతి మకాం హసన్ కు మారిపోయింది. దీంతో ప్రేమించిన యువతి చేతిలో శీలం కోల్పోయిన తాను వేరే యువతిని పెళ్లి చేసుకునేదెలాగా? అంటూ పోలీసులను ఆశ్రయించాడు.
తన శీలాన్ని దోచుకున్న యువతిపై అత్యాచారం కేసు నమోదు చేయడంతో పాటు ఆమెతోనే తన పెళ్లి జరిపించి న్యాయం చేయాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఈ తరహా ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. దీంతో అతడు నిన్న మీడియా ముందుకొచ్చి తన గోడును వెళ్లబబోసుకున్నాడు. యువతులు ఫిర్యాదు చేస్తే మగాళ్లపై అత్యాచార కేసులు నమోదు చేసే పోలీసులు, పురుషులు ఫిర్యాదు చేస్తే మహిళలపై ఎందుకు ఈ కేసులు నమోదు చేయరని అతడు వాపోతున్నాడు.