కోల్ కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై నిలిచి ఉన్న విమానాన్ని వేగంగా దూసుకొచ్చిన బస్సు ఢీ కొట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ప్రయాణికులను విమానం వద్దకు తీసుకెళ్తున్న బస్సు అక్కడ నిలిచి ఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. అదే టైంలో విమానంలో కూడా ఎవరూ లేరు. అయితే తొలుత కమ్యూనికేషన్ గ్యాప్ తో ప్రమాదం జరిగిందన్న అధికారులు మాట మార్చారు. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ మెమిన్ ఆలీని విచారించిన అధికారులు అసలు విషయాన్ని వెల్లడించారు. డ్రైవర్ నిద్ర మత్తు కోట్ల రూపాయల నష్టం కలిగించిందని కోల్ కతా విమానాశ్రయాధికారులు తెలిపారు. వైద్యపరీక్షల అనంతరం జరిపిన విచారణలో నైట్ డ్యూటీలో ఉండడంతో నిద్రను ఆపుకోలేకపోయానని, కునికిపాట్లు పడుతూ నిద్రమత్తులో బస్సును ఢీ కొట్టానని డ్రైవర్ మెమిన్ అలీ వెల్లడించినట్లుగా విమానాశ్రయాధికారులు ప్రకటించారు ఈ ఘటన కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాల్సిన రెండు విమానాలను అధికారులు రద్దు చేశారు. కాగా, మొమిన్ అలీ ఢీ కొట్టిన విమానం విలువ 400 కోట్ల రూపాయలని అధికారులు వెల్లడించారు. విమానంలో చాలా భాగం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎర్త్ బస్సు దెబ్బకు ఎయిర్ బస్సుకు జరిగిన డ్యామేజ్ సుమారు 40 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు.