లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఈ సామెత ప్రస్తుతం అతికినట్లు సరిపోద్ది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాలతో ఇప్పటికే లాభదాయక వ్యాపారాలను ఒక్కటొక్కటిగా వదులుకుంటున్న మాల్యా నుంచి అప్పులు రాబట్టుకునేందుకు ఆయనకు రుణాలిచ్చిన బ్యాంకులు క్యూ కట్టాయి. మాల్యాపై కఠిన చర్యలకు మీన మేషాలు లెక్కించిన బ్యాంకులు... మాల్యా లండన్ కు వెళ్లిపోతున్నారన్న వార్తలు తెలియగానే ఉలిక్కిపడ్డాయి. ఆ వెనువెంటనే తేరుకుని కోర్టుల గడప తొక్కాయి.
ఇప్పటికే డియాజియో నుంచి మాల్యాకు అందే రూ.515 కోట్లపై హక్కు తమకు కల్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంగళూరులోని డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ)ని ఆశ్రయించి సత్పలితాన్నే రాబట్టింది. తాజాగా మాల్యాకు వందలాది కోట్ల రూపాయల రుణాలచ్చిన 17 బ్యాంకులు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కాయి. తమ అప్పులను తీర్చేదాకా విజయ్ మాల్యాను దేశం విడిచివెళ్లకుండా కట్టడి చేయాలని ఆ బ్యాంకులు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది.