ఒకప్పుడు ప్రజా హక్కుల కోసం పోరాడుతున్నామంటూ పెత్తందారీలకు, జమీందార్లకు వ్యతిరేకంగా దాడులు, పోరాటాలు చేసి మావోలు పేదల కడుపు నింపేవారు. అయితే రాను రాను సిద్ధాంతాలను పక్కనబెట్టి లక్ష్యం మార్చుకుని పోలీసులపై దాడులు చేయటంతోనే సరిపెడుతున్నారు. ఇక వారి ప్రాబల్యం తగ్గుతూ వస్తుండటంతో జన జీవన స్రవంతిలో చేరే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. పోలీసులు కూడా పునరావాసం పేరిట వారిని మార్చాలనే ప్రయత్నిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడో ఉదంతలో లొంగిపోయిన ఓ మావోయిస్టు జంటకు వారి ఇష్టానుసారం పెళ్లి చేయటమే కాదు ఏకంగా పోలీసు ఉద్యోగాలను కట్టబెట్టి ఆశ్చర్యపరిచింది ఛత్తీస్ గడ్ పోలీస్ విభాగం.
లక్ష్మణ్ పొడియాల్(24), జన్ మిలీషియా డిప్యూటీ కమాండర్. కోషీ(22) మార్కం మావోయిస్టు సభ్యురాలు. బస్తర్ అడవుల్లో కలుసుకున్నారు. ప్రేమించుకున్నారు. తాము పెళ్లి చేసుకుంటామని మావో నేతలను సంప్రదించగా, వారు అనుమతి నిరాకరించారు. ప్రేమ కోసం వారిద్దరూ లొంగిపోగా, బస్తర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి వారి పెళ్లిని వైభవంగా జరిపించడంతో పాటు ఇద్దరికీ పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు.
"మిగిలిన మావోలకు మా నుంచి మంచి సందేశాన్ని పంపేందుకే ఇలా చేశాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అడవుల్లో ఇద్దరు మావోల వివాహానికి ఎలాంటి అభ్యంతరాలూ లేవు. ఛత్తీస్ గఢ్ లో మాత్రం అలా కాదు. ప్రేమించుకున్న వారిని నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఘటనలూ ఉన్నాయి. వారి లొంగిపోవాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం" అని బస్తర్ రేంజ్ ఐజీ ఎస్ఆర్పీ కల్లూరి వ్యాఖ్యానించారు.
కాగా, వైభవంగా జరిగిన ఈ వివాహానికి దాదాపు 5 వేల మంది అతిథులు వచ్చారు. వారిలో ఐజీ, కలెక్టర్, ఇతర పోలీసు, ప్రభుత్వ అధికారులు కూడా ఉండటం గమనార్హం. గతంలో తాము పోలీసులకు వ్యతిరేకంగా పోరాడామని, ఇక మావోలను రూపుమాపేందుకు కృషి చేస్తామని పెళ్లిపీటలపై గులాబీ రంగా సాఫా ధరించిన లక్ష్మణ్ తెలిపాడు.