శని సింగ్నాపూర్, మహారాష్ట్రలోని షిరిడీకి సమీపంలో ఉన్న ప్రఖ్యాత శనిదేవుని ఆలయం. దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శని దేవుడికి ఎలాంటి గుడి ఉండదు. కేవలం ఓ రాతి శిల్పం మాత్రమే ఉంటుంది. సాధారణంగా ప్రపంచంలో ఎవరి ఇంటికైనా తలుపులు ఉంటాయి. కానీ శని సింగ్నాపూర్ లో ఏ ఇళ్లకు దుకాణాలకు తలుపులు ఉండవు. విలువైన వస్తువులును కూడా బీరువాల్లో దాచి ఉంచే ప్రయత్నాలు చేయరు. ఎందుకంటే అక్కడి మహిమగల దేవుడిపై అంత నమ్మకం. ఇక ఇక్కడి సాంప్రదాయం ప్రకారం మహిళలు పూజలు చేసేందుకు అనుమతి లేదు.
అటువంటిది దేవస్థాన బోర్డు చైర్ పర్సన్ గా ఓ మహిళ ఎంపికైంది. ఆమె పేరు అనితా సేథే. అంతేకాదు బోర్డులో సభ్యురాలిగా కూడా మరో మహిళకు స్థానం లభించింది. తాను ఆలయ సంప్రదాయాలను కొనసాగిస్తానని, తాను ఆలయంలోకి వెళ్లబోనని ఈ సందర్భంగా అనిత వ్యాఖ్యానించారు.
కాగా, ఆ మధ్య ఇద్దరు మహిళలు సెక్యూరిటీ కళ్లు కప్పి ఏడు మెట్లు ఎక్కి దేవుడికి అర్పించి వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ఆలయ కమిటీ మండిపడింది. సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేసింది. అనంతరం పాలాభికేషం చేసి ఆలయానికి సంప్రోక్షణ చేసి పూజా కార్యక్రమాలను కొనసాగించారు. కాగా, ఆ మహిళలు చేసిన పనికి పలువురు ప్రశంసలు కురిపించారు కూడా.