ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే భారతీయ కట్టడం తాజ్ మహల్. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా నిలిచిన ఈ ప్రేమికుల కట్టడం ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే ఆసియా ఖండంలోని కట్టడాల జాబితాలో అగ్రస్థానంలో తాజ్ మహల్ నిలిచింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్ లో ఈ విషయం తేలింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్ లో అత్యధిక మంది పర్యాటకులు తాజ్ మహల్ కోసమే వెతికారు. ఈ మేరకు ఆసియాలోని ఇతర దేశాల్లోని కట్టడాలతో పొల్చి చూస్తే, తాజ్ మహల్ ను చూడటానికే ప్రపంచ పర్యాటకులు ఆసక్తి కనబరిచారని గూగుల్ ప్రకటించింది. తాజ్ మహల్ తోపాటు దేశంలోని కుతుబ్ మినార్, ఎర్రకోట, ఆగ్రా కోట, లావాసా, లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ, హుమాయూన్ సమాధి, షాణివార్ వాడా, జంతర్ మంతర్, ఐఐటీ బాంబే తదితరాలను కూడా చూసేందుకు ప్రపంచ పర్యాటకులు ఆసక్తి చూపారని గూగుల్ వెల్లడించింది.