దేశంలో దొంగనోట్లు కనుక్కోవడం కష్టమేనంటున్నారు ఢిల్లీ పోలీసులు. ఈ నకిలీవి అసలు నోట్లలా ఉంటున్నాయని, వీటిని గుర్తించడం క్రమంగా కష్టమవుతుదని అంటున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల ద్వారా ఇండియాలోకి భారీగా నకిలీ నోట్లు జొరబడుతున్నాయి అని తెలిపిన వీరు-పాక్ ఐఎస్ఐ పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. భారత్ లో చెలామణి అవుతున్న 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లు, నకిలీ నోట్లు దాదాపు ఒకే విధంగా ఉంటున్నాయి. కొన్ని నెలలుగా ఈ తేడాను గమనిస్తున్నాం.. ఇవి క్రమంగా తగ్గుతున్నాయి. దొంగ నోట్లలో వాడే కాగితం, అసలు నోట్ల తయారీలో వాడే కాగితం ఇంచుమించుగా ఒకేవిధంగా ఉంటున్నాయి.. అలాగే వాటర్ మార్క్, గాంధీ బొమ్మ వంటివి ఒకేలా ఉంటున్నాయి అని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారులు పేర్కొన్నారు. ఎంత నిఘా ఉన్నా, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా ఈ నకిలీ నోట్ల సరఫరా జరుగుతూనే ఉందని అంటున్నారు. ఇందు వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బ తింటున్నదని దీనికి సంబంధించిన డీసీపీ సంజీవ్ యాదవ్ అన్నారు. యూపీ లోని ముజఫర్ నగర్ కు చెందిన ఇక్బాల్ కనా అనే 53 ఏళ్ళ వ్యక్తి పాకిస్తాన్ వెళ్లి అక్కడే సెటిలై ఇండియాలోకి నకిలీ నోట్లు పంపిస్తున్నాడనీ, ఇవి తయారు చేసే సిండికేట్లకు ఈయన బాస్ అయ్యాడని ఆయన చెప్పారు. అతడిపై వివిధ రాష్ట్రాల్లో ఎన్నో కేసులు ఉన్నాయని తెలిపారు.