చిన్నారుల ఉత్తమ భవిష్యత్తుకు నిర్దేశకులు ఉపాధ్యాయులే అని చెబుతుంటారు. అయితే పవిత్ర వృత్తిలో ఉన్న చాలామంది ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించడం మనం చూస్తున్నాం. దీంతో వీరి ప్రవర్తన ప్రభావం చిన్నారులపై పడుతుంది. దీనిని గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ముందుగా పొగాకు తీసుకునే ఉపాధ్యాయులను ఉద్యోగాల నుండి తొలగించాలనే నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్ర మంత్రి వినోద్ తావ్ డే మాట్లాడుతూ ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు పొగాకు, దాని ఇతర ఉత్పత్తులను తీసుకోవడం మానడం లేదని, ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. చాలామంది ఉపాధ్యాయులు గుట్కా తినడం వలన ఆ ప్రభావం చిన్నారులపై పడుతున్న విషయాన్ని తాము గమనించామన్నారు. పోగాకుతోపాటు మద్యం సేవించే గురువులపై కూడా వేటు వేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.