ఈ మధ్య సెల్ఫీల సరదా యువతకు పరిపాటిగా మారింది. అది సరదానే, కానీ ఒకోసారి అది వికటిస్తే మాత్రం పెను ప్రమాదంగా మారుతుంది. ఢిల్లీకి చెందిన ఓ ముగ్గురు యువకులు చేసిన ప్రయత్నం... వారి ప్రాణాలు బలిగొంది. ఢిల్లీ, మొరాదబాద్, ఫరీదాబాద్ లకు చెందిన ముగ్గురూ యువకులు వేగంగా వస్తున్న రైలు ఎదుట నిలబడి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు. వేగంగా వస్తన్న రైలు ఢీకోట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. నలుగురు మిత్రులు కలిసి రిపబ్లిక్ డే సందర్భంగా తాజ్ మహల్ చూసేందుకు సోమవారం ఆగ్రా వెళ్లారు. అయితే రైల్వేట్రాక్ చూడగానే తమకు అక్కడ సాహసం చేయాలనిపించిందని, కారు ఆపి వేగంగా వస్తున్న రైలు దగ్గర సెల్ఫీ తీసుకోడానికి ఆగామని ప్రమాదంలో గాయాలతో బయటపడిన అనీష్ అనే నాలుగో వ్యక్తి తెలిపాడు. రైలు రావడానికి కొద్దిక్షణాల ముందు ఫొటో తీసుకుని, అక్కడినుంచి దూకేద్దామనుకున్నా.. ఈలోపే వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొందని ఆ యువకుడు చెప్పాడు. మరణించిన ముగ్గురి పేర్లు యాకూబ్, ఇక్బాల్, అఫ్జల్. వీళ్లంతా 20-22 ఏళ్ల మధ్య వయసువాళ్లే. సెల్ఫీ తీసి దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలన్న వారి ప్రయత్నమే వారిని బలిగొందని తెలుస్తోంది.