సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన ఈ ఉదంతం వింటే ఎవరికైనా కోపం కట్టలు తెంచుకోక మానదు. ఓ మానవ మృగం యువతిని అందరూ చూస్తుండగానే బలవంతంగా ఇడ్చుకెళ్లి, కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తున్నా పట్టించుకోని వ్యవస్థలో మనం ఉన్నాం. పైగా జరిగిన ఘోరంపై ఫిర్యాదు చేస్తే పోలీస్ అధికారులు పట్టనట్లు ఉండటం మరీ దారుణం.
పంజాబ్ లో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముక్తాకసర్‌లో ఓ దళిత యువతి ఒక ప్రైవేట్ కంప్యూటర్ సెంటర్ లో పనిచేస్తోంది. మార్చ్ 25న ఓ వ్యక్తి ఆఫీస్ లోకి చొరబడి ఆమెను ఈడ్చుకెళ్లి, కిడ్నాప్ చేసి ఓ ఫాం హౌస్ లోకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. యువతిని ఆ కామాంధుడు బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఉదంతం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. పక్కనే ఉన్న ఆఫీస్ స్టాఫ్ తో సహా రొడ్డుమీద ఉన్న వారెవ్వరూ అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. అనంతరం యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారేం పట్టనట్లు వ్యవహరించారంట. దీంతో తండ్రి సాయంతో ఆమె జాతీయ కమీషన్ ను ఆశ్రయించింది. కమీషన్ జోక్యంతో అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.