ప్రేమకు అర్థం మారుతోందా? ప్రస్తుతం సమాజంలో జరిగే ఘటనలు, పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఆకర్షణలో పడిపోయి తనకు మాత్రమే దక్కాలనే ఆశతో దారుణాలకు తెగబడుతున్నారు. తనకు కాకుండా మరెవరికో దక్కుతున్నారనే ద్వేషంతోనూ వారిపై దాడి చేయటమే కాదు తమనూ కడతేర్చుకున్న వారు ఎంతో మంది. అసలు దీనికి కారణం ఏంటీ? సామాజిక పరిస్థితులా ? లేక తల్లిదండ్రుల నిర్లక్ష్యమా? కుటుంబ నేపథ్యాలా? కారణం ఏదైనా ఇద్దరిలో ఎవరిదో ఒకరి జీవితం బలికాక తప్పటం లేదు. ఇక్కడ మరో ఉదంతం అలాంటిదే. మనసారా ప్రేమించిన ప్రియురాలు వివాహం చేసుకునేందుకు ఒప్పుకోవడం లేదన్న కోపంతో, క్షణికావేశానికి లోనై ఆమె గొంతు కోసి, ఆపై ఆసుపత్రిలో చేర్చి, అదే భవంతిపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ప్రేమికుడు.
రాంచీ పరిధిలోని పుందాంగ్ సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అమిత్ (29) అనే యువకుడు, తన స్నేహితురాలిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. చాలా సార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినా, యువతి నిరాకరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో మరోసారి మాట్లాడుకునేందుకు రమ్మన్న అమిత్, వాగ్వాదం పెరగడంతో బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రియురాలిని ఆసుపత్రికి చేర్చి, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఆపై ఆసుపత్రి పైకి ఎక్కి, ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.