ముస్లిం స్త్రీలకు 'తలాక్'(వారి సంప్రదాయంలో విడాకులు తీసుకోవటం) పేరిట జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేందుకు అత్యున్నత న్యాయస్థానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. మహిళా హక్కుల పరిరక్షణ దిశగా ఈ విడాకుల వ్యవస్థను సమీక్షించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) కు సుప్రీంకోర్టు సూచించగా, అది చట్టబద్ధం కాదని ఏఐఎంపీఎల్బీ స్పష్టం చేసింది. తమ మతం, విశ్వాసాల్లోనే ముస్లిం లా ఇమిడివుందని, దీనికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద రక్షణ కూడా ఉందని బోర్డు సభ్యుడు మహమ్మద్ అబ్దుల్ రాహుల్ ఖురేషీ వ్యాఖ్యానించాడు.
సామాజిక మాధ్యమాలైన స్పైపే, వాట్స్ యాప్, ఫేస్ బుక్ ద్వారా చెప్పినా, ఎస్ఎంఎస్ చేసినా, ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా 'తలాక్' చెప్పినా అది చెల్లుబాటు అవుతుందని ఆయన అనడం గమనార్హం. తలాక్ తరువాత మహిళలు ఓ గదిలో మగ్గి పోవాల్సిన అవసరం లేదని, మరొకరిని వివాహం చేసుకుని జీవితాన్ని గడపవచ్చని ఆయన అన్నారు. మూడు సార్లు తలాక్ అని చెప్పాల్సిన అవసరం లేదని, ఒకసారి చెప్పినా సరిపోతుందని ఖురేషీ వెల్లడించారు. ఒకవేళ భార్య విడాకులు ఇవ్వాలని భావిస్తే, ఖులాను సంప్రదించాలని, అయితే, విడాకులు ఇచ్చే హక్కు మాత్రం భర్తదేనని అన్నారు.