తక్షణమే ఆర్బీఐ తగ్గించిన వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం బ్యాంకర్లకు ఆదేశించింది. రెండు నెలల వ్యవధిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర శాతం మేరకు రేపో రేటును తగ్గించినప్పటికీ ఆ లాభం ప్రజలకు చేరకపోవటం పట్ల కేంద్రం తీవ్ర ఆగ్రహాం వ్యక్తంచేసింది. గురువారం ఉదయం ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమైన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఈ సమావేశానికి ఆర్బీఐ, సిడ్బి, ఎస్ హెచ్ బీ తదితర ఆర్థిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్బీఐ తగ్గించిన వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. బ్యాంకులకు అవసరమైన రూ.20 నుంచి రూ.25 వేల కోట్లను అందించేందుకు ఇప్పటికిప్పుడు అవకాశం లేనందున మార్కెట్ల నుంచి సమీకరించుకోవచ్చునని ఆర్థిక సేవల కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, తదుపరి పరపతి సమీక్ష నిర్ణయాలు చూసిన తర్వాతే వడ్డీ రేట్ల తగ్గింపు పై ఓ నిర్ణయానికి రావాలని బ్యాంకులు భావిస్తున్నాయి.