విద్యార్థుల జీవితాలను తీర్చి దిద్దే గురువు స్థానంలో ఉండి ఆ వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ చదువుకోసం నానా కష్టాలు పడి పాఠశాలలో చేరిన గిరిజన బాలిక(15)పై గత మూడేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో గర్భవతి అయిన బాలిక... గత నెలలో ఓ చిన్నారిని ప్రసవించింది. అయితే కీచక టీచర్ బెదిరింపులతో విషయాన్ని దాచిపెట్టిన బాధితురాలు.. ఎట్టకేలకు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. కొండగావ్ ఏఎస్పీ నివేదితా శర్మ తెలిపిన వివరాల ప్రకారం... కొండగావ్ జిల్లాలోని ఝాకర్‌పారాలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మాధవ్ నాగ్(52) అనే వ్యక్తి హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న గిరిజన బాలికను.. వార్షిక పరీక్షల్లో మార్కులు ఎక్కువ వేస్తానంటూ లోబరుచుకుని ఆమెపై గత మూడేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడాన్ని గుర్తించి, విషయాన్ని బయటకు చెప్పొద్దంటూ తీవ్రస్థాయిలో బెదిరించాడు. ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితురాలు.. ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు మాధవ్ నాగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేయనున్నట్లు నివేదితా శర్మ వెల్లడించారు.