అదేంటి ప్రసాదం... పంగనామాలు అనుకుంటున్నారా? అందులో మత్తుమందు కలిపారు లేండీ కిలాడీ దొంగలు. దేవుడి ప్రసాదం అంటూ అపరిచితులు పెట్టిన ఆహారం తిని 150 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లగా దుండగులు వారిని దర్జాగా దోచుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అహర్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగా నది ఒడ్డున ఉన్న ఓ కమ్యూనిటీ గెస్ట్ హౌస్ లో సమావేశమైన వారికి ముగ్గురు అపరిచిత వ్యక్తులు ప్రసాదం పంచారు. ఆపై వారంతా మత్తులోకి జారుకోగా, అందరి వద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్ లు దోచుకుపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దుండగుల కోసం పోలీసులు రెండు టీంలుగా ఏర్పడి జల్లెడ పడుతున్నారు.