వసంత పంచమి సందర్భంగా శనివారం ప్రతి పాఠశాలలో సరస్వతి దేవీని పూజించాలని గుజరాత్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయటం ఇప్పుడు విమర్శలకు తావునిస్తోంది. ‘‘విద్యా దేవత, సకల కళామ తల్లి అయిన సరస్వతీ దేవిని వసంత పంచమి నాడు ప్రతి మున్సిపల్ పాఠశాల్లో ప్రార్థించాలి. దీనిద్వారా పిల్లలకు విద్య వల్ల ఉన్నతస్థాయికి చేరుతామని తెలిసివస్తుంది. ప్రతి స్కూల్ లో తప్పనిసరిగా విద్యాదేవీ స్తోత్రాన్ని పఠించి, వందనాలు సమర్పించి, వసంత పంచమి విశిష్టతను విద్యార్థులకు తెలిసివచ్చేలా చూడాలి’’ అని అహ్మదాబాద్ స్కూల్ బోర్డు కార్యనిర్వహణాధికారి ఎల్.డీ,దేశాయ్ పేరిట సర్క్యూలర్ జారీఅయింది. మొత్తం 300 మంది గుజరాతీ మీడియం స్కూల్స్ కి ఈ ఉత్తర్వులు అందాయి. ఈ పాఠశాలలో మొత్తం 10 వేల మందికి పైగా ముస్లిం విద్యార్థులు ఉన్నారు. 50 వరకూ ఉర్ధూ మీడియం స్కూల్ లు కూడా ఉన్నాయి. దీంతో వారంతా నిరసన తెలుపుతున్నారు. మైనార్టీ వర్గానికి చెందిన విద్యార్థులు మనోభావాలు దెబ్బతినే ఇటువంటి ఆదేశాలు ఉపసంహరించుకోవాలని కొందరు కోరుతున్నారు.