ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నాడు. ప్రపంచంలోనే ఫేస్ బుక్ వినియోగదారుల జాబితాలో టాప్ 5 జాబితాలో ఉన్న భారత్ అంటే జుకర్ బర్గ్ కి వల్లమాలిన అభిమానం. అందుకే ప్రధాని ప్రత్యేక ఆహ్వానంపై ఇండియాకు వచ్చాడు. అంతేకాదు ఇక పై ప్రతీ ఏడూ ఇండియాకు వస్తానని ప్రకటించాడు కూడా. అయితే ఎన్నో పెను సవాళ్లను ఎదుర్కొని ఫేస్ బుక్ ని సోషల్ మీడియాలో టాప్ పొజిషన్ లో నిలబెట్టిన ఇతగాడికి ఓ ఐఐటీ కుర్రాడు వేసిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలీక గుటకలు మింగాడట.
ఢిల్లీలోని టౌన్ హాల్ లో ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులతో మార్క్ జుకర్ బర్గ్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఐఐటీ విద్యార్థి ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడుట. తనకు క్యాండీ క్రష్ ఆట ఇన్విటేషన్స్ అస్సలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని ప్రశ్నించాడు. ఇందుకు జుకర్ స్పందిస్తూ, "ఇది చాలాకాలంగా టాప్ ఓటెడ్ క్వశ్చన్ గా ఉంది. నేను మరో సమావేశం నిర్వహించేలోగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని మా డెవలపర్స్ కు చెప్పాను. వారు కూడా అదే పనిలో ఉన్నారు" అని జుకెర్ తెలిపారు.
ఫేస్ బుక్ నుంచి వచ్చిన ఈ క్యాండీ క్రష్ ఆట తక్కువ కాలంలోనే ఎంతో పాప్యులర్ అయింది. ఈ గేమ్ కు అలవాటుపడిన వారి నుంచి వచ్చే ఇన్విటేషన్లను భరించలేక అనేకమంది తమ ఫేస్ బుక్ ఫ్రెండ్ లిస్టు నుంచి తొలగించేస్తున్నారు. దీనిపై అతగాడికి ఫిర్యాదులు కూడా ఎన్నో చేశారు. ఆఖరికి ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లే ముందు క్యాండీ క్రష్ పై జుకర్ బర్గ్ తో చర్చించాలని చాలా మంది రిక్వెస్ట్ లు చేశారు.