సునందది హత్యేనట

January 06, 2015 | 04:43 PM | 54 Views
ప్రింట్ కామెంట్

ఏడాది కిందట మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి అనుమానాస్పదానికి దారితీసింది. ఆమె మృతిని హత్య కేసుగా ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల నివేదక ఆధారంగా కేసును హత్య నేరం కిందికి మార్చారు. సునంద పుష్కర్ మరణించి పడి ఉన్న గదిని పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఇటీవల తిరిగి సందర్శించారు. ఆమె మరణించినప్పటి నుంచి ఆ గదిని మూసేశారు. తిరిగి ఇప్పుడే తెరిచారు. నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఈ నెల 29వ తేదీన నివేదికలను సమర్పించింది. ఆ నివేదికల ఆధారంగా హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ చెప్పారు. పుష్కర్ మృతి అసహజమైందని, విషం వల్ల జరిగిందని నివేదికలో తేలినట్లు ఆయన తెలిపారు. విషం నోటి ద్వారా గానీ ఇంజక్షన్ ద్వారా గానీ ఇచ్చి ఉంటారని ఆయన చెప్పారు. విసరా రిపోర్టు కోసం చూస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ కేసులో శశి థరూర్‌ను దర్యాప్తు అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మృతికి కారణమైన విషపదార్థం ఏమిటనేది కనుక్కోవడానికి విసరాను విదేశీ నిపుణులకు పంపించే విషయాన్ని ఢిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నారు. విషం వల్లనే ఆమె మరణించిందని ఎయిమ్స్ వైద్యులు చెప్పినప్పటికీ అది ఏ రకమైన విషమనేది చెప్పలేకపోయారు. విసరా నమూనాలను యూకేకు చెందిన లాబొరేటరీకి పంపించే యోచనలో పోలీసులు ఉన్నారు. సునంద పుష్కర్ జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్లో మరణించింది. పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్‌తో సంబంధం ఉందని ఆరోపించిన మర్నాడే ఆమె మరణించింది. మృతురాలి మూడు మొబైల్ ఫోన్లను, ల్యాప్‌టాప్‌ను పోలీసులు గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ