దొంగ బాబాల గురించి, వారి అఘాయిత్యాల గురించి రోజూ వార్తల్లో వస్తున్నప్పటికీ వారికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. భక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుని వారు దారుణాలకు తెగ బడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ మధుర లో దారుణం చోటు చేసుకుంది. కష్టాలతో విసిగిన ఆ మహిళ ఆదుకోవాలని ఆశ్రయిస్తే ఆ ‘కామ’ బాబా, మరో దుర్మార్గుడు కలిసి ఆమె పై అత్యాచారం చేశారు. ఘజియాబాద్ కు చెందిన సదరు మహిళ(32) భర్త ఇటీవలె చనిపోయాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి ఆమెను కలిసి కష్టాలు తీరే ఉపాయం చెప్పాడు. మధురలో ఉన్న ఓ బాబాకు తన కష్టాలు చెప్పుకుంటే వెంటనే తీరుతాయని సలహా ఇచ్చాడు. అంతే కాదు ఆమెను వెంట పెట్టుకుని ఆ బాబా దగ్గరకు తీసుకెళ్లాడు. అనంతరం వారిద్దరు ఆమె పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. స్థానికుల సహకారంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆ దొంగ బాబాను, మరో వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు.