స్మార్ట్ ఫోన్ అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్ కస్టమర్లకు దగ్గరైతే చాలని ప్రతీ సంస్థలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మరో కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇండియాలోని అతిపెద్ద ఈ-కామర్స్ సేవల సంస్థ ఫ్లిప్ కార్ట్ అధికారిక వెబ్ సైట్ వచ్చే నెల నుంచి మాయం కానుంది. వెబ్ సైట్ స్థానంలో కేవలం సెల్ ఫోన్ యాప్ ద్వారా మాత్రమే వ్యాపారాన్ని నిర్వహిస్తామని సంస్థ ప్రకటించింది. అయితే, ఇది ఒక రకంగా గ్యాంబ్లింగ్ వంటిదని నిపుణులు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ యూజర్లకు దాదాపు 3 వేల వరకూ యాప్స్ అందుబాటులో ఉండగా, సరాసరిన 15 యాప్స్ స్మార్ట్ ఫోన్లలో లోడ్ అవుతున్నాయి. వీటిల్లో ఫేస్ బుక్, మ్యూజిక్ యాప్, వాట్సప్, యూట్యూబ్ లతోపాటు యాంగ్రీబర్డ్స్ వంటి గేమ్స్ కి స్థానం తప్పనిసరి. ఇక టాప్ 15 మొబైల్ యాప్స్ లో ఒక్కటంటే ఒక్క ఈ కామర్స్ యాప్ కు కూడా చోటు లేదని మొబైల్ ఇంటెలిజన్స్ సంస్థ క్వెట్టరా వెల్లడించింది. దీంతో ఫ్లిప్ కార్ట్ కొత్త అంచనాలు ఏ మేరకు సంస్థను ముందుకు తీసుకువెళ్తాయన్న విషయమై అనుమానాలు నెలకొన్నాయి.