ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన నాలుగురోజుల సమ్మె మరోసారి వాయిదాపడింది. వేతనాలు పెంచనందుకు నిరసనగా ఈనెల 21 నుంచి 24 వరకు సమ్మె చేయనున్నట్లు బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి. కానీ, ఫిబ్రవరికల్లా సమస్యను పరిష్కరిస్తామని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) హామీ ఇవ్వడంతో సమ్మె ప్రతిపాదనను వాయిదావేసుకుంటున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళి వెల్లడించారు. ఈ నెల 7న కూడా ఒకరోజు సమ్మె చేయాలని నిర్ణయించుకొన్నప్పటికీ ఐబీఏ అభ్యర్థన మేరకు యూనియన్లు ప్రతిపాదనను రద్దు చేసుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె మరోసారి వాయిదాపడింది. ఐబీఏ ఇచ్చిన హామీతో సమ్మెను వాయిదా వేసినట్టు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఫిబ్రవరి మొదటి వారంలో జరగనున్న ఐబీఏ సమావేశంలో ఉద్యోగుల వేతనాల డిమాండ్-కు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ అంశం 2012 నుంచి పెండింగ్-లో ఉంది. యాజమాన్యానికి, బ్యాంకు ఉద్యోగులకు మధ్య జీతాల పెంపు విషయమై చర్చలు జరుగుతున్నా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. దీంతో ఉద్యోగులు పలుమార్లు ఆందోళనకు దిగారు. వేతనాలను 23 శాతం పెంచుతూ వేతరణ సవరణ చేయాలని డిమాండ్ చేసిన యూనియన్లు, గత చర్చల్లో 19.5 శాతానికి దిగివచ్చారు. అయితే యాజమాన్యాలు 12.5 శాతానికి మించి ఇచ్చేది లేదని తేల్చి చెప్పాయి. సమ్మెకు పిలుపునివ్వడంతో యూనియన్లతో ఐబీఏ చర్చలు ప్రారంభించింది. కానీ చర్చల్లో ఎలాంటి పురోగతీ లేదు. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే సమావేశంలో సమస్యను పరిష్కరిస్తామని ఐబీఏ హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు మెత్తపడ్డాయి. అయితే చర్చల్లో డిమాండ్లను పరిష్కరించకపోతే, తాము మళ్లీ సమ్మెకు సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.