మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సాంఘిక సమస్య అమ్మాయిల అక్రమరవాణా. ఎన్ని చట్టాలు చేసినా, అక్రమ రవాణాని అరికట్టడం అనేది వాస్తవంగా సాధ్యం కావటం లేదు. దేశంలో తరచుగా ఎక్కడో ఒక చోట అమ్మాయిల అక్రమ రవాణా సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా విజయనగరంలో పూరి - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న 15 మంది అమ్మాయిలను పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే... పూరి - తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా అమ్మాయిలను తరలిస్తున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం అందింది. పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు గురువారం వేకువజామున ఆ రైలును ఆపి అకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులో ఉన్న కొందరు అమ్మాయిల పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. భీమవరంలో ఓ చేపల చెరువు కాంట్రాక్టర్ వద్ద పనికి వెళుతున్నామని ఓసారి, తమది రాజమండ్రి అని, పూరీలో దేవుడి దర్శనానికి వెళ్లి వస్తున్నామని ఓసారీ చెప్పారు. దీంతో పోలీసులు రైలులో ఉన్న ఒడిశా, శ్రీకాకుళం సరిహద్దు ప్రాంతానికి చెందిన 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 15 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకుని శిశు సంక్షేమ భవనానికి తరలించారు. అయితే వారిని అక్రమంగా తరలిస్తున్న దుండగులు మాత్రం తప్పించుకుని పరారైయ్యారు. కాగా వీరి గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.