చెన్నై నుంచి ముంబయి వెళ్లాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానంలోని టాయ్ లెట్ లో కిలోన్నర బరువున్న బంగారం కడ్డీలు బయటపడ్డాయి. సింగపూర్ నుంచి చెన్నైకి గత రాత్రి చేరుకున్న ఈ విమానం ముంబయికి వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులు దిగిన వెంటనే టాయ్ లెట్ ను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అక్కడో నల్లని రంగు సంచిని చూసి బాంబుగా భయపడ్డారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు పరిశీలించి చూడగా అందులో దాదాపు రూ.48 లక్షల విలువైన బంగారు బిస్కెట్లు ఉన్నాయి. బంగారాన్ని ముంబయి చేరవేసేందుకు విమానాశ్రయ సిబ్బంది ఎవరో స్మగ్లర్లకు సహకరించి ఉండవచ్చన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు.