స్కాలర్ షిప్ తో ఆ యువతి ఎంత పనిచేేసింది?

October 09, 2015 | 05:43 PM | 2 Views
ప్రింట్ కామెంట్
guradiya-anita-madhya-pradesh-scholarship-niharonline

ఏదైనా ఒక్కడితోనే మొదలౌవుతుంది అన్నది మరోసారి రుజువయ్యింది. అవును... రాజకీయ నేతలు, అధికారులు ఎవరు స్పందించని టైంలో ఒక్క యువతి మొత్తం గ్రామ స్థితిగతిని మార్చిపడేసింది. ఆమె మదిలో మెదిలిన ఆలోచన మొత్తం గ్రామాన్ని కదిలించివేసింది. తన స్కాలర్ షిప్ డబ్బుతో ఆమె చేసిన పని ఆ ఊరి ప్రజల్లో ఎనలేని చైతన్యాన్ని తీసుకువచ్చింది. ఇంతకీ ఆ యువతి స్కాలర్ షిప్ తో ఏం చేసిందంటే... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురాదియా గ్రామం అది. గ్రామంలో మొత్తం 748 కుటుంబాలు ఉన్నాయి. వాటిల్లో సగం మంది బహిర్భూమి నిమిత్తం ఆరు బయటకు వెళ్లాల్సిందే. అటువంటి కుటుంబాల్లో 21 ఏళ్ల అనితా కాలేశ్రియా కుటుంబమూ ఉంది. తన తండ్రిని ఎన్నిమార్లు టాయిలెట్ కట్టించమని అడిగినా, అందుకు రూ. 5 వేలు అవుతుందని, అంత డబ్బు వెచ్చించే స్థితిలో కుటుంబం లేదని చెబుతూ వచ్చాడు. దాంతో తన విద్యాభ్యాసం కోసం వచ్చిన స్కాలర్ షిప్ డబ్బులో రూ. 3 వేలు విత్ డ్రా చేసి ఇంట్లో టాయిలెట్ కట్టించే పని మొదలు పెట్టి పని పూర్తి చేయించింది ఆ విద్యార్థిని. ప్రతి ఇంట్లోనూ టాయిలెట్ ఉండాలన్న ఆకాంక్షను ప్రజల్లో రగిలించింది.

                ఒక్క గురాదియాలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లోనూ ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించింది. ఇప్పుడామె ఆ గ్రామంలో టాయిలెట్లపై ఓ అనధికార బ్రాండ్ అంబాసిడర్. "నేను ఆమె కట్టించిన టాయిలెట్ ను పరిశీలించాను. చాలా నచ్చింది. నేను కూడా ఇంట్లో అదే తరహాలో తక్కువ ఖర్చుతో టాయిలెట్ నిర్మించుకునేందుకు ఒత్తిడి తెచ్చి విజయవంతమయ్యా. ఇప్పుడు మా వదిన, నానమ్మలకు ఎంతో సౌకర్యంగా ఉంది" అని గ్రామంలోని మరో యువతి సీమా వెల్లడించింది. కాగా, అనిత చేసిన పనిని, చేస్తున్న ప్రచారాన్ని గ్రామ పంచాయతీతో పాటు స్వచ్ఛంద సంఘాలు అభినందిస్తున్నాయి.

గ్రామాల్లో ఒక్కో టాయిలెట్ నిర్మాణం కోసం రూ. 12 వేలను కేంద్రం అందిస్తున్నప్పటికీ, ఇంట్లో టాయిలెట్ నిర్మించుకున్న తరువాతనే డబ్బిస్తామన్న మెలిక, ఎందరో పేదలను ఇప్పటికీ అవసరాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లేలా చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ డిసెంబరులోగా గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ ఓ మరుగుదొడ్డి ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న అనిత ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ