హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం కావటంతోపాటు వివాదాలకు తావునిస్తోంది. దేశంలోని పెద్ద పర్వత సానువుల్లో ఒకటైన ఆరావళి పర్వతాలు అడవుల విభాగంలోకి రావని హర్యానా అటవీ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాల ప్రకారం పవిత్ర మంగర్ బానీ దేవాలయం ఉన్న ప్రాంతం సైతం అటవీ శాఖ పరిధిలో ఉండబోదు. కేవలం తమ రికార్డుల్లో గుర్తించిన ప్రాంతానికి మాత్రమే అటవీ చట్ట ప్రకారం రక్షణ ఉంటుందని రాష్ట్ర అటవీ శాఖ కార్యదర్శి పేరిట ప్రకటన వెలువడింది. ఈ విషయంలో పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా గనులను తవ్వి జాతి సంపదను కొల్లగొడుతున్న వారికి సహాయపడేందుకు హర్యానా సర్కారు గట్టిగానే కృషి చేస్తోందని విమర్శించారు.