ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్న ఆడపిల్లలపై మృగాల అఘాయిత్యాలు ఆగటం లేదు. తాజాగా తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్ గురి జిల్లాలోని కరాల నది వద్ద చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం నలుగురు ఆ బాలికను బలవంతంగా మూతబడిన పిల్లల పార్కులోకి తీసుకెళ్లి అనంతరం మత్తుపదార్థాలు కలిపిన ఆహార పదార్థాలను ఇచ్చారు. బాలిక మత్తులోకి జారుకుంటుండగానే సామూహికంగా అత్యాచారానికి పాల్పడి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కాగా, కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులు ఇంటికి రాని తమ కూతురు కోసం తీవ్రంగా గాలించారు. చివరకు సోమవారం కరాల నది వద్ద ఉన్న పాడుబడ్డ పార్కులో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్పృహలోకి వచ్చిన ఆ బాలిక, జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు, పోలీసులకు వివరించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో దారుణానికి పాల్పడిన నలుగురిని బాధితురాలు గుర్తించింది. వారంతా మైనర్లు కావటం విశేషం. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. వైద్య నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ రబీంద్రనాథన్ చెప్పారు.