ఇస్రో మరో భారీ ప్రయోగానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే మంగళయాన్, చంద్రయాన్ లాంటి ప్రయోగాలతో మన దేశ కీర్తిని నలుదిశలా చాటిన ఇస్రో... మరో మూడేళ్లలో చంద్రయాన్-2ను ప్రయోగించనుంది. ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, చంద్రయాన్-2 ప్రయోగానికి ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీకి ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త యూఆర్ రావు నేతృత్వం వహిస్తారని తెలిపారు. మన గ్రహ వ్యవస్థలోని ఏ గ్రహం మీదకైనా అంతరిక్ష నౌకలను పంపే విధంగా ప్రయోగాలు చేపట్టాలన్న అంశంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. భారీ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్టు కిరణ్ కుమార్ వెల్లడించారు. అకాల వర్షాల కోసం మోడల్స్‌ను అభివృద్ధి చేయాలని అన్నారు ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్. వాతావరణం, అకాల వర్షాలకు సంబంధించిన వివరాలపై కల్పనా-1 తరహా శాటిలైట్ సమాచారం ఇస్తుందని, ఇలాంటి మోడల్స్ ను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కిరణ్ చెప్పారు.