నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి జూన్ 6వ తేదీన, ఉదయం 8 గంటల 49 నిముషాలకు ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించడానికి పండితులు ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. భూమిపూజను రాజధానికి ఈశాన్య భాగంలో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటపుడు కృష్ణానదికి అభిముఖంగా, దుర్గగుడి ఎదురుగా పూజ చేస్తే బాగుంటుందని పండితుల అభిప్రాయం. అయితే ప్రదేశం ఎంపికకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. భూమి పూజ చేయాలనుకుంటున్న ప్రదేశాన్ని ఖరారు చేసిన వెంటనే సుమారు 50 ఎకరాల వరకు భూమిని చదును చేసి సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారం. ఈ భూమి పూజ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓ సమావేశాన్ని కూడా నిర్వహించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే జూన్ 8 వ తేదీన చద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్నసందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. వెంటవెంటనే రెండు సభలు ఏర్పాటు చేయటం బాగుండదేమోనని ప్రజాప్రతినిధుల అభిప్రాయం. ఏది ఏమైనా ఈ నెల 25, 26 తేదీల్లో అన్ని విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులంటున్నారు.