ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కేవలం రాజకీయ నాయకుడినే కాదు మాంచి గాయకుడు కూడా. నోయిడా ప్రాంతంలో ఉన్న రేడియో మిర్చి స్టేషన్ కు వెళ్లినప్పుడు కేజ్రీవాల్ లోపల దాగున్న కళాకారుడు బయటపడ్డాడు. త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన రేడియో ద్వారా జనానికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. స్టేషన్ కు వెళ్లిన ఆయనకు అక్కడి ఆర్జేలు, సిబ్బంది గిటార్ వాదనతో సాదరంగా స్వాగతం పలికారు. బాలీవుడ్ క్లాసిక్స్ ను ఆయన కోసం వాళ్లు పాడారు. 'ఆప్ యహా ఆయే కిస్ లియే' అని వాళ్లు ప్రశ్నించగా... అదే స్వరంలో కేజ్రీవాల్ కూడా వెంటనే 'ఆప్ నే బులాయా ఇస్ లియే' అని సమాధానం ఇచ్చారు. కల్ ఆజ్ ఔర్ కల్ చిత్రంలో ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది. దాన్ని గుర్తుపెట్టుకుని కేజ్రీవాల్ పాట పాడటంతో ఆర్ జేలతో సహా అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు.