దేశ రాజధాని సమీపంలో మతోన్మాదం కట్టలు తెచ్చుకుంది. సాటి మనిషి అన్న సంగతి మరిచి ఘోరానికి పాల్పడ్డారు. ఆవు మాంసం తిన్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా చంపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని దాద్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గోమాంసం నిషేధం అమలులో ఉంది. అయితే మహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి ఆవు మాంసం తిన్నాడని, ఇంట్లో దాచుకున్నాడని ఆరోపిస్తూ, ఆందోళనకారుల గుంపు దాడి చేసి అతనిని కొట్టి చంపారు.
మహమ్మద్ ను, అతని కుమారుడిని ఇంట్లో నుంచి బయటకు ఈడ్చిన అల్లరి మూక వారిపై దయారహితంగా దాడి చేశారు. వీరి కుటుంబం దాద్రి ప్రాంతంలో మటన్ దుకాణాన్ని నిర్వహిస్తోంది. వీరు ఆవుమాంసాన్ని నిల్వ చేసి ఉంచుతున్నారని ఆరోపిస్తూ, దాడి జరుగగా, మహమ్మద్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్ర గాయాల పాలైన ఆయన కుమారుడిని ఆసుపత్రిలో చేర్చగా, అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఇంట్లోని మాంసం నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఈ ఘటన ఢిల్లీకి కేవలం 56 కిలోమీటర్ల దూరంలో జరిగింది.