మానసిక స్థితి సవ్యంగా లేనప్పుడు మౌనవ్రతమే మహదొడ్డ ఔషదం. మహాత్ముడు ఈ కిటుకు గ్రహించినందుకే మహాత్ముడయ్యేడు. బాపూ నువ్వు బ్రిటీష్ వారి తొత్తువి అని బ్రతికుండగా అని ఉంటే కొలస్ట్రాల్ అధిక మోతాదులో కలిగిన కట్జూని ఏమీ అనకుండా మౌనం వహించేవాడు. ఐన్ స్టీన్ విజ్ణులందరికీ సుపరిచితుడు. సాపేక్షసిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మేధావి. భావితరాలు గాంధీ అనే పేరుగల ఒక వ్యక్తి ఈ భూమ్మీద మానవరూపంలో నడయాడేడనేది నమ్మశక్యం కాదని చెప్పేడు. అదే బోసు బాబుని జపనీయుల ఏజెంటువి అని కితాబిస్తే అణుబాంబు తీస్కుని మార్కండేయుడి నెత్తిమీద ఒక్కటిచ్చును. ఉచితానుచితాలు మరిచి దేశభక్తే ఊపిరిగా దేశమాత సంకెళ్లు చేధించే యత్నంలో ఎల్లలెరుగని ఆవేశంతో, ధ్రుడసంకల్పంతో నిస్వార్థంగా పోరాడిన మహానుభావుల్ని తూలనాడి కించబరచడం తప్పని గడ్డిపెట్టె వివేచన కలిగేలా మార్కండేయ కట్జూకి ఏదైనా భారీస్థాయి వెటర్నీరీ ఇంజక్షన్ ఇప్పించాల్సిన ఆగత్యముంది. మహాత్ముడి అనుచరులు, సహచరులుగానీ, ఆజాద్ హింద్ ఫౌజ్ యోధులుగానీ ఎవరైనా మిగిలి ఉంటే మార్కండేయుని పైత్యానికి సరైన వైద్యం చేయగలరు. ఆపాటి మనం చెయ్యలేమా? పిచ్చోడి సెక్షన్ల కింద కేసు పెట్టాలని చట్ట సభకే చచ్చు సలహా ఇచ్చే రేంజు ఈ మార్కండేయ మహానుభావుడిది. దేశానికి స్వాతంత్ర్యంతోబాటు వాక్ స్వాతంత్ర్యం ఇప్పించినందుకో సదరు పరమ పురుషులకు తగిన సన్మానం చేసినందుకు ఈ వాచాలకు శ్రద్ధాంజలి- హేరామ్!