తమిళనాడులోని తంజావూరుకి 18 కి.మీ. దూరంలో ఉన్న ఓ చిన్ని గ్రామం మేలత్తూరు. మే నెల వచ్చిందంటే మాత్రం దేశం నలుమూలనుండి జనం ఈ ఊరుకు పయనమవుతారు. ఎందుకంటే ఇక్కడ జరిగే భాగవతమేళా వారి నాట్యోత్సవాలు తిలకించడానికి. మే నెలలో మాత్రమే అదీ నృసింహ జయంతి సందర్భంగా ఈ నాట్యోత్సవాలు నిర్వహిస్తారు. సుమారు 75 సంవత్సరాలుగా మేలత్తూరు భాగవత మేళా వారు ఇక్కడ అనేక నాటకాలను ప్రదర్శిస్తున్నారు. సంవత్సరం పొడుగునా ప్రశాంతంగా ఉండే మేలత్తూరులో మే నెలలో మాత్రం సందడి నెలకొంటుంది. మేలత్తూరు వెళ్లి, వదరరాజ్ పెరుమాళ్ సన్నిధిలో నాటకాల్ని చూడటం తీర్థయాత్రకు వెళ్లిన అనుభూతిని కలిగిస్తుందని అక్కడకు వెళ్లినవారు చెబుతారు. దేశం నలు మూలల నుంచి నటులు, కళాకారులు, నాట్యకారులు... అందరూ వారి వారి సొంత ఖర్చులతో మేలత్తూరు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. ఈ నాటక రూపకర్త వెంకటరామశాస్త్రి. సుమారు 500 సంవత్సరాలుగా భాగవత మేళావారి ఈ ప్రదర్శనలు అందరికీ కనువిందు చేస్తున్నాయి. మేలత్తూరు, సాలియమంగఠం, తంజావూరు ప్రాంతాలలో ఈ ప్రదర్శనలు విస్తృతంగా జరుగుతాయి. వీరి ప్రదర్శనలలో స్త్రీ పాత్రలను సైతం పురుషులే పోషించడం ఓ ప్రత్యేకత.