తెలంగాణాలోని వరంగల్ నిట్ లో 50 శాతం సీట్లు తెలంగాణా విద్యార్థులవేనని తెలంగాణా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీట్లు కోరడం సరికాదన్నారు. నిట్ కు సంబంధించి 50 శాతం సీట్లు తెలంగాణా రాష్ర్ట విద్యార్థులకు చెందాలని, మిగతా 50 శాతం సీట్లు ఇతర రాష్ర్టాలకు కేటాయించాలన్నారు. తమ విద్యార్థులు నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 371-డి ఆర్టికల్ వర్తించబోదని చెప్పారు. న్యాయపరంగా తమకు దక్కాల్సిన సీట్లు వదులుకునే ప్రసక్తే లేదని అన్నారు కడియం. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి అడ్మిషన్ విధానం ద్వారా సీట్లు భర్తీ చేసి ఏపీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని మానవ వనరుల అభివృద్ధి శాఖను కోరింది. అయితే ఈ విషయంపై చర్చించేందుకు తెలంగాణా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఢిల్లీ వెళ్లారు.