మాజీ సైనికాధికారి, కేంద్ర విదేశీ వ్వవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. ట్విట్టర్‌లో ‘press’titutes కు prostitutes కు తేడా ఏంటీ ? O స్థానంలో E తప్ప అంటూ మీడియాని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు తీవ్రస్ధాయిలో ఆయనపై ధ్వజమెత్తాయి. మంత్రి స్ధానంలో ఉండి నిర్లక్ష్యపు ట్వీట్స్ చేసిన వీకే సింగ్‌పై ప్రధాని మోదీ చర్యలు తీసుకోగలరా అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇక, ప్రభుత్వ నైతికతను ముంచేదిగా వికే సింగ్ వ్యాఖ్యలు ఉన్నయని ఎన్‌సీపీ, ప్రజాస్వామ్యపు విలువను కనీసం అర్థచేసుకోలేని వ్యక్తి అని సమాజ్‌వాదీ పార్టీ, బాధ్యతారహితమైన, నిర్లక్ష్యపు వ్యాఖ్యలని జేడీయూ పార్టీలు పేర్కొన్నాయి. యెమెన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వీకే సింగ్ జిబౌటీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఏర్పాట్లపై జిబౌటీలోని ఓ టీవీ ఛానెల్ మంగళవారం ఆయన్ని సంప్రదిస్తే, ప్రవాస భారతీయల తరలింపు ప్రక్రియ కంటే పాక్ ఎంబసీ సందర్శనే ఉత్తేజకరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. పాకిస్ధానీ డే సెలబ్రేషన్స్‌కు హాజరవడంపై మీడియాలో పలు కథనాలు రావడంతో మీడియాను ఉద్దేశించి వీకే సింగ్ పై వ్యాఖ్యలు చేశారు.