చాలా మంది మహిళలు పెళ్ళయినా పుట్టింటి ఇంటి పేరునే ఉంచేసుకుంటున్నారు. మొదటి నుంచీ ఉన్న సర్ నేమ్ ను పెళ్ళయ్యాక ఎందుకు మార్చుకోవాలన్నట్టుగా ఉంటోంది వాళ్ళ ధోరణి. ఈ నేపథ్యంలో పెళ్లయినా తమ ఇంటిపేరు మార్చుకునేందుకు 40 శాతం మందికి పైగా ఒంటరి మహిళలు ఆసక్తిచూపడంలేదని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షాదీ డాట్‌కామ్ ఈ సర్వే నిర్వహించింది. పెళ్ళి గురించి కొంత మంది మహిళల అభిప్రాయాలను అడగ్గా 40 శాతం మంది ఒంటరి మహిళలు ఇంటి పేరు మార్చుకోబోమని తెలిపారు. మరో 27 శాతం మంది పెళ్లయిన తర్వాత ఆర్థిక స్వతంత్రంతో ఉండడానికి ఇష్టం చూపగా, 18 శాతం మంది మగవారితో సమానంగా కుటుంబ బాధ్యతలను పంచుకుంటున్నామని తెలిపారు. 14 శాతం మంది ఆడవాళ్ళు భర్త తల్లిదండ్రులపై భార్యభర్తలు ఇరువురూ బాధ్యత తీసుకుంటున్నప్పుడు తమ తల్లి దండ్రుల బాధ్యతలను కూడా భర్తలు స్వీకరించాలని కోరారు.