ఇటీవల కాలంలో అద్దె గర్భాలు బాగా పెరిగిపోయాయి. అయితే చెన్నైకి చెందిన 28 ఏళ్ళ యువతికి సంతాన యోగ్యం లేక బిడ్డ కోసం తపిస్తుండగా, తన బిడ్డ బాధ చూడలేని ఓ తల్లి తన కడుపునే అద్దె కడుపుగా మార్చేసింది. టీనగర్‌కు చెందిన 28 ఏళ్ల యువతి గర్భవతిగా ఉన్నప్పుడు ఏడో నెలలో ప్లాసండల్ అబ్రప్షన్ వ్యాధికి లోనైంది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమె జబ్బు నయం కాకపోగా, గర్భంలోనే బిడ్డ చనిపోవడంతో బిడ్డతో సహా గర్భసంచిని తీసివేశారు. ఇక ఆమెకు తల్లయ్యే భాగ్యం లేదని కుమిలి పోతుండడంతో, వైద్యులు సరోగసి ద్వారా బిడ్డను పొందమని సూచించారు. అయితే ఆమె తల్లే కుమార్తెకు బిడ్డను కని ఇచ్చేందుకు సిద్ధపడింది. 60 యేళ్ళ వృద్ధురాలు అయినప్పటికీ తన గర్భాన్ని తన కూతురి కోసం ఉపయోగించి, నవ మాసాలు మోసి నవంబర్ రెండున ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ఇలా కన్న బిడ్డ కోసం తన గర్భంతో బిడ్డను కని తన బిడ్డకు కానుకగా ఇచ్చింది. ఆకాశ్ ఫెర్టిలిటీ క్లినిక్ వైద్యులు కామరాజ్, జయరాణీ కామరాజ్ శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. భారత్ లో ఈ విధంగా బిడ్డకోసం కన్నతల్లే బిడ్డను కని ఇవ్వడం ఇది రెండవదనీ, మొదటి కేసు గుజరాత్ లో జరిగిందని తెలిపారు.