తాగుబోతును జుట్టుపట్టుకుని లాక్కెళ్లిన ఓ యువతి పోలీస్ స్టేషన్లో అప్పగించింది. తనపట్ల అనుచితంగా ప్రపర్తించిన తాగుబోతును జనమంతా గుడ్లప్పగించి చూస్తున్నప్పటికీ ధైర్యంగా నిలబడిన ఆ యువతి కాండివ్లి రైల్వే స్టేషన్లో పోలీసులకు అప్పగించింది. ముంబైలోని బోర్విలికి చెందిన మంధరే (20) విలే పార్లే లోని కాలేజీలో మాస్ మీడియా మూడవ సంవత్సరం చదువుతోంది. కాలేజీ నుంచి తిరిగి వస్తూ లోకల్ ట్రైన్ కోసం స్టేషన్లో ఎదురు చూస్తుండగా...ఎక్కడినుంచో వచ్చాడో ఒక తాగుబోతు ఆమె మీద చేయివేశాడు. భయంతో పక్కకు జరిగింది. దీంతో మరింత ముందుకు వచ్చాడా దుండగుడు. షాక్ నుంచి తేరుకున్న ఆమె వెంటనే తన దగ్గరున్న కాలేజీ బ్యాగ్‑తో అతగాడిని నాలుగు ఉతుకులు ఉతికింది. అయినా గురువుగారు దారికి రాలేదు. పైగా ఎదురు దాడికి దిగాడు. అంతే మంధరే కోపం కట్టలు తెంచుకుంది. జుట్టు దొరక బుచ్చుకొని గవర్నమెంటు రైల్వే పోలీస్ స్టేషన్ దాకా ఈడ్చుకొచ్చి పోలీసులుకు అప్పగించేదాకా ఆ కోపం చల్లార లేదు. రకరకాల ప్రశ్నలతో విసిగించిన రైల్వే పోలీసు అధికారులు చివరికి మంధరే ఫిర్యాదు స్వీకరించి, అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.