బేటీ బచావ్, బేటీ పడావ్ లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తండ్రులంతా తమ కూతుళ్లతో సెల్ఫీలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆసక్తికరంగా ఉన్న ఈ టాపిక్ పై న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించాలనుకుంది. అంతే అనుకున్నదే తడవుగా కొన్ని పెద్ద తలల ఫోటోలను తీసుకుని ఓ ఆర్టికల్ లో ప్రచురించింది. అయితే అసలు తత్వం బోధపడని ఆ వ్యాస రచయిత అనుకోకుండా ఓ పెద్ద పొరపాటు చేశాడు. అది ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పరువుకే ఎసరు పెట్టింది. విషయంలోకి వెళ్లితే.. 70 ఏళ్ల డిగ్గీరాజా అమృతరాయ్ అనే 40 ఏళ్ల టీవీ జర్నలిస్టుతో పీకల లోతు ప్రేమలో ఉన్నారు. అంతేనా త్వరలో వారిద్దరు ఒక్కటి కానున్నారు. ఆ మధ్య వారిద్దరు బాగా క్లోజ్ గా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఇప్పడేమైందంటే అందులోని ఒక ఫోటో చూసిన న్యూయార్క్ టైమ్స్ అది కూడా సెల్ఫీ విత్ డాటర్ అనుకున్నారట. అంతే ఆ ఫోటోను కూడా పోస్ట్ చేసి పారేశారు. దానిని చూసిన ఓ వ్యక్తి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని మోదీ కూతురితో సెల్ఫీ అన్నారే గానీ, కూతురి వయస్సు ఉన్న అమ్మాయితో సెల్ఫీ అనలేదు అని కామెంట్లు చేశాడు. అనవసరంగా మాట్లాడి పెద్దది చేసుకోవటం ఎందుకా అనుకున్నారేమో వారిద్దరు గప్ చుప్ గా ఉన్నారు. మొత్తం మీద ప్రధాని నినాదం డిగ్గీరాజా కొంపముంచిందన్న మాట.