ఆ గ్రామస్తులు వెలుగు ప్రసాదించమని వేడుకుంటున్నారు

January 17, 2015 | 11:08 AM | 28 Views
ప్రింట్ కామెంట్

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్లు ఇన్నేళ్లయినా ఆ ఊరికి ఇంకా కరెంట్ రాలేదు. కొద్దికాలం వెలుగులు ప్రసరించినా అది ఎక్కువ రోజులు నిలవలేదు. రెండు దశాబ్దాలుగా ఆ గ్రామం చీకటిలో మగ్గుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ జిల్లాలో ఉంది సాధిక్ పూర్ గ్రామం. దాదాపు 3 వేల మంది జనాభా ఉన్న ఈ ఊళ్లో కరెంట్ గత 20 ఏళ్లుగా కరెంట్ లేదు. ఈ సమస్య సాధిక్ పూర్ వాసుల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. చదువుకునే దారిలేక నిరుద్యోగులు పెరుగుతున్నారు. దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్న నేతలు తమ గ్రామానికి కరెంట్ ఇవ్వలేకపోతున్నారని 26 ఏళ్ల అజయ్ కుమార్ సింగ్ వాపోయాడు. స్తోమత కలిగిన వాళ్లు సోలార్ విద్యుత్ లో నెట్టుకొస్తున్నారని తెలిపాడు. ఈ సమస్య కారణంగా యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. చీకటి పల్లెకు తమ పిల్లలను పంపేందుకు ఆడపిల్లల తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. వినీత్ కుమార్(26)ను ప్రేమించి పెళ్లిచేసుకుని సాధిక్ పూర్ వచ్చిన ప్రియాంకా సింగ్ ది మరో వ్యధ. భర్తతో కలిసి సివిల్స్ కు ప్రిపేరవుతున్నఆమె చీకటి కారణంగా చదువు సాగించలేకపోతోంది. ఇక సెల్ ఫోన్లు చార్జింగ్ పెట్టుకోవాలంటే సాధిక్ పూర్ వాసులు పొరుగు ఊళ్లకు పరుగులు పెట్టాల్సిందే. తన చిన్నప్పుడు కరెంట్ స్తంభాలు పాతి వైర్లు బిగించారని స్థానిక దుకాణదారుడు చోటి అలీ(47) వెల్లడించాడు. కొన్నేళ్లు కరెంట్ వచ్చిందని, ఏమైందో గానీ ఒక రోజున కరెంట్ పోయిందని.. మళ్లీ ఇప్పటివరకు రాలేదని వివరించాడు. తమ గ్రామానికి 'వెలుగు' ప్రసాదించమని ఎన్నిసార్లు విద్యుత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేకపోయిందని సాధిక్ పూర్ గ్రామస్థులు వాపోయారు. అయితే 20 రోజుల క్రితం ఈ ప్రాంత విద్యుత్ ముఖ్య అధికారిగా బాధ్యతలు చేపట్టిన పీకే గోయల్.. సాధిక్ పూర్ వాసుల కరెంట్ కష్టాలు తీరుస్తానని హామీయిచ్చారట. చూద్దాం... చీకటి ముసుగు నుంచి సాధిక్ పూర్ కి విముక్తి లభిస్తోందో లేదో...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ