ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నా పట్టుకుని తీరుతామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టం కళ్ళుగప్పి తప్పించుతిరుగుతున్న దావూద్ ఆటలు ఇంకెంతో కాలం కొనసాగవని, త్వరలోనే అతడి ఆటకట్టిస్తామని భారత్ తెలిపింది. దావూద్ పాకిస్తాన్ లోనే ఉన్నాడని నిర్ధారించే టేపులను తమ వద్ద ఉన్నట్లు, వాటి ఆధారంగా దావూద్ ను అరెస్ట్ చేసి తీరుతామని విదేశాంగ శాఖ తెలియజేసింది. భారత్ కు చేసిన ద్రోహాం మరిచిపోలేనిదని, అతడ్ని పట్టుకోవడమే తమ లక్ష్యమని తెలిపింది. మరోవైపు దావూద్ ను మట్టుపెట్టే ఛాన్స్ దొరికినప్పటికీ కూడా రాజకీయ ఒత్తిళ్లతో వెనక్కు తగ్గిన అంశంపై మాత్రం కేంద్రం స్పందించటం లేదు. ఐదుగురు సైనిక సిబ్బంది ప్రాణాలకు తెగించి మరీ దొంగ పాస్ పోర్ట్ లతో పాకిస్థాన్ వెళ్లి ఈ రిస్కీ ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఇంకో పది నిమిషాల్లో దావూద్ అక్కడికి వచ్చేస్తాడన్న సమయంలో హఠాత్తుగా ఫోన్ చేసి ఆపరేషన్ నిలుపుదల చేయాల్సిందిగా సైన్యం వారిని ఆదేశించింది. దీనివెనుక ఓ బడా నేత హస్తం ఉన్నట్లు వార్తలు వినవచ్చాయి కూడా. చేతికి అందిన అవకాశాన్ని జారవిడుచుకుని ఇప్పుడిలా ప్రగల్భాలు పలకడం ఎంత వరకు సబబు అంటారు?