గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్... మహేష్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన బిజినెస్ మెన్ సినిమా ట్యాగ్ లైన్ ఇది. ఇప్పుడు ఇదేందుకంటారా?? సినిమాలో ఓ సన్నివేశంలో హీరో చెబుతాడు ఆయుధం ఉన్న ప్రతివోడు కింగ్ అయి పోవచ్చని. ఇక ఇప్పుడు అసలు మ్యాటరేంటంటే... ఇండియాలో ఆయుధాల జారీ విధానాన్ని మరింత సరళతరం చేస్తూ 56 ఏళ్లనాటి ఆయుధాల చట్టానికి సవరణ ప్రతిపాదనలు కేంద్రం చేసింది. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే మరింత సులువుగా తుపాకీ లైసెన్స్ లభించనుంది. ప్రస్తుతం ఓ ఆయుధాన్ని వెంట ఉంచుకోవాలంటే సవాలక్ష సమస్యలు. ఒకవేళ పోలీసుల కంట పడితే వారడిగే యక్ష ప్రశ్నలకు సమాధాలు ఇవ్వాల్సి రావటంతోపాటు డజనుకు పైగా డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇకపై ఆ బాధల్లేకుండా ఆయుధాలకు యునిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ను కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొత్తగా లైసెన్స్ లు తీసుకునేవారితోపాటు అల్రెడీ ఆయుధాలు ఉన్నవారు కూడా ఈ లైసెన్స్ ఖచ్ఛితంగా తీసుకోవాల్సిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా, దాడులు, హింసాకాండ పెరిగిపోవటం నేపథ్యంలో ఆయుధాల లైసెన్స్ లను సులభతరం చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కానీ, దీని ద్వారా క్రైం రేట్ పెరగటంతోపాటు అసాంఘిక కార్యకలాపాలు అడ్డు అదుపు లేకుండా జరుగుతాయని కొందరు విమర్శిస్తున్నారు.