చట్టాలు వారికి చుట్టాల కనిపిస్తున్నాయి కాబోలు. అందుకే ఆడవాళ్లపై ఆకృత్యాలకు ఏ అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా పంజాబ్ లో జరిగిన ఓ దారుణాన్ని ఆ తల్లి చెబుతుంటే రక్తం మరగక మానదు. తన కూతురుపై ఆకృత్యాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకున్నందుకు కదులుతున్న బస్సులోంచి ఆ తల్లి, కూతుళ్లను తోసేయగా ఘటనలో కూతురు చనిపోయింది. తల్లి తీవ్ర గాయాలపాలైంది. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణం పంజాబ్ లో చోటుచేసుకుంది. మోగా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ తల్లి, తన పద్నాలుగేళ్ల కూతురు, కుమారుడితో కలిసి గురుద్వారా దర్శనానికి ప్రైవేట్ బస్సులో బయలుదేరింది. పది కిలో మీటర్లు వెళ్లాక బస్సులోని కొందరు వ్యక్తులు తమ కూతురుతో తప్పుడుగా ప్రవర్తించడం ప్రారంభించారు. ఇది గమనించిన తల్లి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారు ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె కండక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆ కర్కశకుడు కూడా వారితో కలిసి తల్లి కూతుళ్లను నిందించడం మొదలుపెట్టాడు. దీంతో తల్లి భయంతో బస్సు ఆపాల్సిందిగా డ్రైవర్ ను బతిమాలింది. అయినా అతను ఆపకుండా నడిపాడు. అలా పదిహేను నిమిషాల పాటు వారిని బస్సులో ఇబ్బంది పెట్టి కిందికి తోసేశారు. దీంతో రోడ్డు మీద పడి తీవ్రంగా గాయపడిన బాలిక నిస్సహాయంగా రొడ్డుపై పడి కొట్టుకుంది. ఇంకా దారుణం ఏంటంటే అటుగా ఎవరూ కూడా వారి ఆర్తానాదాలను పట్టించుకోకపోవటం. అలా గాయాల పాలయిన బాలిక గంటలపాటు ఎవరి సాయం అందక నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయింది. ఆ తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బస్సును గుర్తించిన పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.