ప్రపంచ ధనికుల జాబితాలో భారత్ 3వ స్థానం. ఇటీవల ఓ సంస్థ విడుదల చేసిన జాబితాలో 97 మంది తో భారత్ కుబేరుల జాబితాలో ఉండటం చూసి మనమంతా చంకలు గుద్దుకున్నాం. కానీ, కేంద్రం విడుదల చేసిన ఓ జాబితా ఇప్పుడు విస్మయానికి గురిచేస్తోంది. ఇండియాలో నివసిస్తున్న వారిలో 21.5 కోట్ల మంది వద్ద ఒక్క రూపాయి విలువైన ఆస్తి కూడా లేదట. ఈ మేరకు సోమవారం కేంద్రం అధికారిక గణంకాలు విడుదల చేసింది. ప్రభుత్వం ఆస్తులుగా గుర్తించిన టీవీ, మోటర్ సైకిల్, మొబైల్ ఫోన్ వంటి 7 ఆర్థిక విలువను సూచించే ఐటమ్స్ లేని వారి లెక్కలను వెలువరించింది. మొత్తం జనాభాలో 4.3 కోట్ల కుటుంబాల వద్ద నయాపైసా ఆస్తిలేదని తెలిపింది. వీరిలో 1.6 కోట్ల కుటుంబాలు ఆదివాసీలవేనని పేర్కొంది. వీరితో పోలిస్తే దళితులు, ముస్లిం కుటుంబాలు మెరుగైన జీవనం కొనసాగిస్తున్నాయని తెలిపింది. ఆదివాసీల్లో 60 శాతం కన్నా తక్కువగా అక్షరాస్యత ఉందని, వీరిలో కేవలం 40 శాతం మంది మాత్రమే పక్కా ఇళ్లలో నివసిస్తున్నారని జాతీయ సరాసరి కన్నా ఇది 53 శాతం తక్కువని తెలిపింది. షెడ్యూల్ కులాలు, తెగల వారి సంక్షేమానికి కేటాయించిన వేల కోట్ల రూపాయిల నిధులను వేరే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించటమే వెనుకబాటుతనానికి కారణమని నిపుణులు వ్యాఖ్యనించారు. కాగా, 2014-15 బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి 82,935 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఎంత కేటాయించిన ఏం లాభం. భారత్ ఒక అభివ్రుద్ధి చెందుతున్న దేశం. అవును... ఎప్పుడు విన్నా అభివ్రుద్ధి చెందుతూనే ఉంటుంది. ఎప్పటికీ చెందుతుందో మరీ!