మగ, ఆడ కు తామేమీ తీసుపోమంటున్నారు హిజ్రాలు. చిన్న చూపు చూస్తున్నప్పటికీ తమ ప్రతిభతో రాజకీయాలు, సినిమాల్లోనే కాదు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా పోటీకి వచ్చేస్తున్నారు. అధికారికంగా వారిని మూడో వర్గం కేటగిరీ కింద గుర్తించకపోయినప్పటికీ కోర్టుల చొరవతో అన్ని రంగాల్లో అందివచ్చిన అవకాశాన్ని పుచ్చుకుంటున్నారు. తాజాగా దేశంలోనే తొలిసారిగా ఓ పోలీస్ ఉద్యోగానికి అదికూడా ఎస్ ఐ ఉద్యోగానికి ఎంపి-కైంది/కయ్యాడు ఓ హిజ్రా.
తమిళనాడుకు చెందిన హిజ్రా ప్రీతికా యాస్ని కొద్దిరోజుల కింద ఎస్ ఐ పోస్ట్ కు దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తులో మూడో కేటగిరీ లేకపోవటంతో స్రీ అనే రాసుకున్నారు. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ లో ప్రీతిక హిజ్రాగా తేలింది. దీంతో ఆమె అప్లికేషన్ ను పక్కన పడేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. విషయం పసిగట్టిన ఆమె కోర్టును ఆశ్రయించి పరీక్ష ను పూర్తిచేసింది. అంతేకాదు మెరిట్ ఫలితంతో ఉద్యోగాన్ని కొట్టేసింది. అయితే అధికారులు మాత్రం ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా చాలాకాలంగా పెండింగులో ఉంచారు. దీంతో మరోసారి ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో ప్రీతికకు పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని మద్రాసు హైకోర్టు తీర్పిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. హిజ్రా అయితే పోలీస్ కాకుడదనే చట్టం ఎక్కడైనా ఉందా అని కోర్టు ప్రశ్నించింది. అలాగే పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డులో మూడో కేటగిరి(హిజ్రా)లకు ఉద్యోగ కల్పనకు విధి విధానాలను రూపొందించాలని హైకోర్టు సూచించింది. తద్వారా మరింత మంది హిజ్రాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ అభిప్రాయపడ్డారు.