అది ఆగస్టు సెమిస్టర్ కు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరీక్ష. సీరియస్ గా విద్యార్థులంతా ఎగ్జామ్ రాయడానికి కూర్చున్నారు. ఇంతలో ఇన్విజిలేటర్ వచ్చి ప్రశ్నాపత్రం ఇచ్చాడు. అంతే కట్ చేస్తే... స్టూడెంట్స్ ఒక్కసారిగా షాక్ కావాల్సిన పరిస్థితి. ఇంతకూ వారిని అంత షాక్ కు గురి చేసిన కారణం ఏంటంటారా? అందులో అడిగిన ప్రశ్నలు... అవేంటో తెలుసా? రాజమౌళి తీసిన బాహుబలి చిత్రంపై! 50 మార్కుల ప్రశ్నా పత్రంలో 40 మార్కుల ప్రశ్నలు బాహుబలిపైనే. అయితే అది కావాలని చేసిందేనట. చిత్రం గురించి వివరాలు, ఆపై టెక్నికల్ వివరాలు ఇచ్చిన ప్రశ్నాపత్రంలో, ఓ ఫైటింగ్ సీన్ లో ప్రభాస్, రానాలకు దెబ్బలు తగలకుండా తీసుకున్న జాగ్రత్తలేవి? అని, నువ్వే ఆ సెట్ కు ఇన్ చార్జ్ గా ఉంటే తీసుకునే జాగ్రత్తలేవి? అని ప్రశ్నించారుట.
అంతేకాదు భవన నిర్మాణాలకు వాడాల్సిన ప్రమాణాలు బాహుబలి సినిమాలో కనిపించాయని కూడా ఉపోద్ఘాతంలో వ్యాఖ్యానించడం గమనార్హం. మంచి ఇంజనీరింగ్ డిజైన్ ఉందని, నటీనటుల రక్షణకు ఎన్నో చర్యలు తీసుకున్నారని వాటిని బొమ్మల రూపంలో కూడా వివరించారు. అన్నట్టు ఈ ప్రశ్నాపత్రం ఎవరిదో తెలుసా? చెన్నై, వేలూరు కేంద్రాలుగా ఇంజనీరింగ్ కళాశాలల చైన్ నడుపుతున్న ప్రతిష్ఠాత్మక 'వీఐటీ'ది! అక్కడ కూడా బాహుబలి క్రేజ్ అలా ఉంది మరీ.